అమెరికా-చైనా సంబంధాలలో కొత్త మలుపు

అమెరికా మరియు చైనా మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా ఉన్నప్పటికీ, కొత్త చర్చలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు.

ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, “మేము రష్యాపై చాలా ముఖ్యమైన ఆంక్షలు విధించాము. చాలా కఠినమైన, అలాగే చాలా బలమైన ఆంక్షలు. మాస్కోపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని చెప్పారు.

ట్రంప్ మాట్లాడుతూ, రష్యా సమస్యలో చైనా అమెరికాకు సహాయం చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. “మేము రష్యాపై కఠినమైన చర్యలు తీసుకున్నాము, కానీ చైనా సహకరిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది” అని ఆయన వెల్లడించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక పక్క మాస్కోపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, రష్యా తన సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

డోనాల్డ్ ట్రంప్ ఈ వారంలో ఒక ప్రధాన ఆసియా పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలను సందర్శిస్తారు. అలాగే ఆయన ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు.

ఈ సమావేశంలో ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రమే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలను కూడా చర్చించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా సహకరిస్తే, ఉక్రెయిన్‌లో శాంతికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.

ట్రంప్ ముందుగా మలేషియాలో జరిగే ఆసియాన్ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని బుసాన్‌కు వెళతారు.