గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబుతో కలిసి ‘గ్లోబ్‌ట్రాటర్ (SSMB29)’ అనే భారీ ప్రాజెక్ట్‌లో ప్రియాంక కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మందాకిని పాత్రను పోషిస్తోంది.

ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 12న విడుదలైంది. పోస్టర్ విడుదలకు ముందు, ప్రియాంక తన అభిమానులతో ఎక్స్‌ (ట్విట్టర్‌)లో చాట్ చేస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

భారతీయ సినిమాల్లో తిరిగి ప్రవేశించడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోందని ప్రియాంక చెప్పింది. ఒక అభిమాని “ఇది మీ కొత్త యుగమా?” అని అడగగా, ఆమె స్పందిస్తూ “ఆశాజనకంగా ఇది భారతీయ సినిమాల్లో నా పునఃప్రవేశం అవుతుంది. నాకు కచ్చితంగా తెలియదు కానీ ఇది అద్భుతంగా ఉంటుంది” అని చెప్పింది.

రాజమౌళితో పని చేయడం కష్టమా అని అడిగినప్పుడు, “రెండూ (రాజమౌళి మరియు మహేష్‌తో పని చేయడం) కష్టం కాదు కానీ రెండూ జీవితాన్ని మార్చేవి” అని ప్రియాంక సరదాగా సమాధానమిచ్చింది.

ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నానని, డైలాగ్‌లను తానే చెబుతానని ప్రియాంక వెల్లడించింది. “రాజమౌళి చాలా సహాయం చేస్తున్నారు. నేను నా తెలుగు డైలాగ్‌లను నేర్చుకుంటున్నాను. మీ అంచనాలకు అందుతాను” అని ఆమె చెప్పింది.

హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడుతూ “ప్రపంచంలోనే అత్యుత్తమ బిర్యానీ అదే!” అని ప్రియాంక కొనియాడారు.

రాజమౌళి మరియు మహేష్ బాబు కలిసి చేస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు నిర్మాతలు. ఈ ఈవెంట్ జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అదే రోజు సినిమా టైటిల్ మరియు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.