మనిషి కంట్రోల్ చేయగలిగిన రోబోట్‌లను మనం చూసే ఉంటాం. ప్రస్తుతం తనకు తాను ఓ మనిషిలా ఆలోచించి… నిర్ణయం తీసుకునే రోబో గురించి మీకు తెలుసా? చైనాలోని తియాంజిన్ యూనివర్సిటీ మరియు సదరన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త రోబోను అభివృద్ధి చేశారు. మానవ స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించి తయారు చేసిన మెదడును దీనికి అమర్చారు. దీంతో ఇది సొంతంగా ఆలోచించి, నిర్ణయం తీసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రోబోట్‌కు రెండు చేతులు, రెండు కాళ్లు మరియు బ్రెయిన్ కూడా అమర్చారు. మానవ స్టెమ్ సెల్స్‌ను ల్యాబ్‌లో పెంచి, చిన్న బ్రెయిన్ టిష్యూ తయారు చేశారు. ఇది న్యూరాన్స్‌తో సజీవంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టిష్యూను ఓ స్పెషల్ న్యూరల్ చిప్‌తో కనెక్ట్ చేసి, రోబోను కంట్రోల్ చేసే విధంగా డెవలప్ చేశారు. దీనిని ‘మెటా-బ్రెయిన్ రోబోట్’ లేదా ‘బ్రెయిన్-ఆన్-చిప్ రోబో’గా పిలుస్తున్నారు.

స్టెమ్ సెల్‌తో మెదడు టిష్యూతో ఇది, సమాచారాన్ని తీసుకుని నడవడం, వివిధ అడ్డంకులను తప్పించడం, వస్తువులను క్యాచ్ చేస్తుందని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఇది మెదడుతో అన్ని విషయాలు నేర్చుకుంటుందన్నారు. అయితే, ఇది ఇప్పటికి ప్రారంభ దశలోనే ఉందన్నారు.

ఈ సరికొత్త ఆవిష్కరణ బయో-రోబోటిక్స్ రంగంలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోబోట్‌కు మానవ మెదడును అమర్చడం ద్వారా, భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ఆవిష్కరణ ద్వారా, రోబోటిక్స్ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని మరియు మానవ జీవితాన్ని మెరుగుపరచడంలో ఈ సాంకేతికత ఎంతో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.