రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. రాష్ట్రం పరిశ్రమల రంగంలో వేగంగా ముందుకు వెడుతోందని కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితమైపోయాయని ఆయన అన్నారు.

విశాఖలో రాఘవులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో పెట్టుబడుల సదస్సులు జరిగినప్పటికీ, వాటి ఫలితంగా కుదిరిన ఒప్పందాల్లో 10 శాతం కూడా అమలు కాలేదని గుర్తు చేశారు. భూములు పొందడానికి మాత్రమే కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని, అయితే పరిశ్రమలు స్థాపించడానికి అవి ముందుకు రావడం లేదని తెలిపారు. గతంలో కేటాయించిన భూముల్లో ఇప్పటికీ పెద్ద భాగం ఖాళీగానే ఉందని ఆయన ఎత్తి చూపారు.

గత రెండేళ్లలో రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయని బీవీ రాఘవులు పేర్కొన్నారు. కేవలం పర్యటనలు, భారీ సదస్సులు నిర్వహించడం కంటే నిజంగా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. డేటా సెంటర్లు ఎక్కువగా ఉపాధి అవకాశాలను సృష్టించలేవని, కనుక కూలీలు, యువతకు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంట్‌కు నాసిరకం ముడి సరుకు సరఫరా అవుతోందని, ఉద్యోగులకు జీతాలు సమయానికి అందడం లేదని ఆరోపించారు. ప్లాంట్‌లో కీలక పదవులు ఖాళీగా ఉండటాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం ఒకటేనని, రెండు ప్రభుత్వాలూ ప్లాంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

దేశంలో విమానాయాన రంగం సంక్షోభానికి గురవడం ప్రైవేటీకరణ విధానాల ఫలితమని బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు.