జగనన్న ప్రాజెక్టులనే తమరు చెప్పుకుంటారేమిటి సార్!

|| || || Leave a comments

దాదాపు ఏడాది రోజుల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అవి. ఇప్పుడు తమ ప్రభుత్వంలో వాటిని సాధించి తీసుకువచ్చిన స్థాయిలో మంత్రులు చెప్పుకుంటూ ఉండడం తమాషాగా ధ్వనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబెరాయ్ గ్రూపు హోటళ్ల నిర్మాణానికి సంబంధించి.. పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెబుతున్న మాటలు చిత్రంగా ఉన్నాయి.

ప్రజలకు అందరికీ బహిరంగంగా తెలిసిన వ్యవహారమే గనుక.. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే శంకుస్థాపనలు చేశారు గాని, అప్పట్లో పనులు ముందుకు సాగలేదు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కందుల దుర్గేష్. ఆ పనులు ఇప్పుడు మొదలవుతున్నాయి కనుక దానిని తన ఘనత గాను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనత గాను గుర్తించాలని కోరుకుంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలోనే ఓబెరాయ్ గ్రూప్ తో సుధీర్ఘ మంతనాల తర్వాత రాష్ట్రంలో విశాఖపట్నం సమీపంలో భోగాపురం అన్నవరం వద్ద, తిరుపతిలో, కడప జిల్లా గండికోట వద్ద మూడు సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆ గ్రూపు ఆసక్తి చూపించింది. పోయిన ఏడాది జూలైలో ఈ మూడింటికి గండికోట నుంచి వర్చువల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు.

సాధారణంగా భారీ హోటల్ నిర్మించే సమయం నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి ఎక్కువ వ్యవధి తీసుకుంటారు. వాస్తవంగా పనులు ప్రారంభమయ్యేలాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కందుల దుర్గేష్ ఈ హోటల్స్ నిర్మాణం దిశగా గత ప్రభుత్వ హయాంలో అడుగులు పడనే లేదని.. ఈ సెప్టెంబర్ 30లోగా భోగాపురం వద్ద నిర్మాణ పనులు మొదలవుతాయని అంటున్నారు. మిగిలిన తిరుపతి, గండికోట ప్రాజెక్టుల విషయం ఆయన మాట్లాడడం లేదు.

జగనన్న జమానాలో శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టులలో రెండింటి నాటక ఎక్కించి ఒక్కటి మాత్రం ముందుకు తీసుకు వెళుతూ అది కూడా తమ ఘనత లాగా చెప్పుకోవడం దుర్గేష్ కు మాత్రమే చెల్లింది.

ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విషయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు తాము క్రెడిట్ తీసుకోవాలనుకోవడం సరైన ఆలోచన కాదు. ఆ విషయం నాయకులు తెలుసుకుంటే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు.