వార్తల్లో నిలబడడం కడప రెడ్డెమ్మ, ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డికి బాగా తెలిసినట్టుంది. అందుకే ఆమె నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ వుంటారు. కడప నగరంలో ఏదో చేస్తున్నట్టు ఆమె హడావుడి చేస్తున్నారు. రాజకీయంగా ఈ విద్య తెలిస్తే ఎంత వరకైనా రాణించొచ్చు. కడప రెడ్డెమ్మ రాజకీయంగా ఎదగాలని తపన పడుతున్నారు. టీడీపీ పెద్దల దృష్టిలో పడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.
తాజాగా మీడియా సమావేశంలో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కడప ఎమ్మెల్యే ఏమన్నారంటే…
“కడప నగరంలో గూండాలు, దాదాలు అనుకునే వాళ్లంతా సాయంత్రం వేళల్లో రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకుని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపం. మీరు ఇట్లాంటి చేష్టలు మానుకుని మీ ఇళ్లలో కుర్చీలు వేసుకుని కూర్చోండి. మీ మీటింగులు మీ ఇళ్లలో పెట్టుకోండి. వీధుల్లోకి వచ్చి పెద్ద పోటుగాళ్లని ఫీల్ అవుతున్నారేమో. వీపులు విమానం మోత మోగుతాయి”
ఇప్పుడు అధికారం చెలాయిస్తోంది టీడీపీనే. ఆ పార్టీతో పాటు జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి. వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి గూండాయిజం, దాదాగిరి ప్రదర్శించే పరిస్థితి లేదు. ఈ విషయం కడప ఎమ్మెల్యేకి తెలియంది కాదు. ఇంతకూ ఆమె హెచ్చరించింది టీడీపీ నాయకుల్నా? లేక వైసీపీ నేతల్నా? అనేది చర్చనీయాంశమైంది. మాధవీరెడ్డికి గిట్టని టీడీపీ నేతలు కొందరు ఇతర నియోజక వర్గాల నుంచి వచ్చి కడపలో అధికారం చెలాయిస్తున్నారు.
అలాగే కడప నియోజకవర్గం పరిధిలో రాజకీయంగా ఆమెతో విభేదించే నాయకులు కడపలో ల్యాండ్ సెటిల్‌మెంట్స్ తదితరాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని కడప రెడ్డెమ్మ మాస్ వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఆమె వార్నింగ్ తీవ్ర చర్చనీయాంశమైంది.