శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభం కావడంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివిధ చర్యలు తీసుకుంటోంది. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం ప్రసాదంగా ఇస్తారు. ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం పొందడానికి శబరిమలకే వెళ్లాల్సిన అవసరం లేదు. భక్తులు తామున్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్ చేస్తే, నేరుగా శబరిమల నుంచి అరవణ ప్రసాదం ఇంటికే చేరుతుంది.
ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మరియు పోస్టల్ డిపార్ట్‌మెంట్ కలిసి ఈ సేవను అందిస్తున్నాయి. భారతదేశంలోని అన్ని పోస్టాఫీసుల నుంచి శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రసాద కిట్‌లో నెయ్యి, అరవణ పాయసం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం ఉంటాయి.
ప్రసాదం కొనుగోలు చేయడం ఎలా?
- భారతదేశంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లండి.
- శబరిమల అయ్యప్ప ప్రసాదం కోసం ఆర్డర్ చేయండి.
- ప్రసాదం ధరను చెల్లించండి.
ప్రసాదం ధరలు
- ఒక టిన్ అరవణ ప్రసాదం కిట్: ₹520
- 4 టిన్ అరవణ ప్రసాదం కిట్: ₹960
- 10 టిన్ అరవణ ప్రసాదం కిట్: ₹1,760
ప్రసాదం కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం నేరుగా మీ ఇంటికి వస్తుంది. ప్రతి ఏడాది మకరవిళక్కు పూజ ప్రారంభమై, కొద్ది రోజుల అనంతరం అయ్యప్ప ఆలయం మూసివేయబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేయబడుతుంది.
ఈ సేవ ద్వారా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తులు ఇంట్లో నుంచే అరవణ ప్రసాదాన్ని కొనుగోలు చేయవచ్చు. శబరిమల అయ్యప్ప భక్తులకు ఇదో ఆనందకరమైన వార్త.