ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయకండని చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం ఎవరు కట్టినా 24 గంటల్లో కూల్చివేయండని డిమాండ్ చేశారు.
చెరువులు, కాలువలకు అడ్డంగా కడితే ఏమవుతుందో వయనాడ్ ఘటనే ఉదాహరణ అని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష కోసం హైడ్రా వాడొద్దు.. అధికార పార్టీ నుంచే ఈ కూల్చివేతలు మొదలవ్వాలన్నారు. రైతు ఋణమఫీ ఆగస్ట్ 15లోపు చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు చెప్పారని గుర్తు చేశారు. గతంలో పదవులను గడ్డిపోచల్లగా వదిలేశామని హరీష్ రావు చెప్పారని.. ఇప్పుడు కూడా ఓ సారి పదవిని వదిలేయాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మంత్రి, హరీష్ రావు గ్రామానికి వెళ్లి రుణమాఫీపై అడగండన్నారు. అందరికి మాఫీ అయితే హరీష్ రావుని అక్కడే రాజీనామా చేయించాలని కోరారు.
కాగా..తాజాగా జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్ళిందని లాయర్ చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. కేసు విచారణను ముగించండి.. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.